Movie: Bandook
Lyrics: Goreti Venkanna
Singer: Saketh Komanduri
పూసిన పున్నమి వెన్నెల మేన తెలంగాణ వీణ
వాసిగ చరితల వెలుగొందిన గత వైభవాల కోన
పద గతుల వాణి స్వర జతుల వేణి
ఉప్పొంగి మురిసే ఉల్లముల బాణి
సంబూరమాడే సింగిడి మేళ
మోదుగులపూల వసంతహేల
తంగెడుపూల బంగరు నేల
జమ్మికొమ్మన పాలపిట్టల
గంతులేసే ఆ జింక పరుగుల
యిడుపు యిడుపున జానపదంబులు
యింపుగ పూసిన కవనవనంబులు
ఎగసిపారే ఎన్నెన్నో ఏరులు
మురిసి ఆడే బతుకమ్మ ఊరులు
బుద్ధుని పాదపు ముద్రల బండ
మన ఫణిగిరి కొండ
పద్మ నాయకుల దేవరకొండ
మేటి రాచకొండ
కొలనుపాక తీర్థంకర పాద
వర్ధమాన ముని తెలిపిన బోధ
యాదగిరి నరసన్న మొక్కులు
జానుపాడు సైదన్న సూక్తులు
వడి వడి కలబడి కుడి ఎడమల బడి
గడీల పొగరును దించిన దళములు
వాడిగ వడిసెల విసిరిన కరములు
పడి పడి పరుగులు పెట్టిన జులుములు
నందికొండ నీటితో నిండ
ఊరు ఊరున పైరులు పండ
కరువుల బరువులు జరుగును దూరం
నల్లగొండ వరి తరి మాగాణం
పారే వాగులు పచ్చని కొండలు
పరిమళమైన పూల గాలులు
కీసరగుట్టలు హరికీర్తనలు
శివతత్వంబులు అనంతగిరులు
భూమిల దాగిన సలువకొండలు
తాండూరు శాబాదు బండలు
కుంకుమ కన్నా మెత్తని దుక్కులు
కూరలు కాయలు కుప్పల రాసులు
రంగారెడ్డి నేలకు విలువ
కుంచములతో బంగారము కొలువ
పాలకుర్తి కవనపుమేళా
భాగవతము ఘన పోతన లీల
కాకతీయ గణపతి వీర
యుగంధరుడు యోచనలో ధీర
పాకాల రామప్ప చెరువులు
గొలుసుకట్టు జలధార నెలవులు
వేయి స్థంభముల శబ్ద నాదములు
పేరిణి భేరిని నాట్య పాదములు
సమ్మక్క సారక్కల తెగువ
సర్వాయి పాపన్నని మడువ
ఓరుగల్లు అడుగడుగున గుళ్లు
తలచుకుంటే పులకించును ఒల్లు
మేటి ఏలికలు శాతవాహనుల
కోటిలింగముల పురమీనేల
కోడే ముడుపులకు భజన కొలుపులకు
వరములిచ్చె రాజన్న లీల
ఊరి ఊరిలోన ఉక్కుని మించినట్టి కోట
ఉబికే చరితల ఊట
సిరిసిల్ల మగ్గాల నేత
మేనికి అద్దిన సొగసుల పూత
కవనం భువనం ఎల్లలుదాట
కరీంనగర్ వాగ్దేవికి బాట
జ్ఞానపీఠమై పూసినతోట
తెలుగు వాకిట పరువంబొలికే
కృష్ణవేణి ముఖద్వారం
పుప్పొడి మించిన ఇసుక రేణువుల
అందమైన దుందుభి తీరం
మన్నెంకొండ సిరిసనగండ్ల
గట్టుకుర్మ జోగులాంబ
రామగిరి శ్రీరంగాపురములు
నల్లమల సలేశ్వరతీర్థం
తరాలు గడసిన వాడని వూడల
ఊయలలూపే పిల్లలమఱ్ఱి
పాలమూరు తల్లీ
కొమురం భీం జోడెన్ ఘాట్
గిరిజనవీరుల చరితను చాటు
మేస్త్రం జాతి తప్పదు నీతి
నడిపించే నాగోబాజ్యోతి
గోండు కోలన్ థోటిఆత్రం
గుస్సాడి నాట్యం నిర్మల్ సిత్రం
బాసరతీర్థం సంగమక్షేత్రం
కుంటాల ఝరి జల సంగీతం
ఇప్ప జిట్టా రేగు టేకు
నల్లమద్ది దిరిశన మాకు
ఆదిలబాదుకు అడవే సోకు
జైనుల బౌద్ధుల.. జైనుల బౌద్ధుల బోధనశాల
విష్ణుకుండినులు ఏలిన నేల
జీనవల్లభుడు హరికేసరుడు
పంపకవి ప్రవచించిన బోధలు
ఇంద్రపురి కైలాసగిరి
బాలకొండ దుర్గాలబరి
నల్లరేగడి పసుపు యాగడి
చెరుకు వెన్నులు పాల జున్నులు
పంటసేల తళుకు పల్లె పరవశించి కులుకు
పెద్దగుట్ట ఉరుసు బోధను చెక్కరయ్యి కురుసు
గల గల గల గల పైరుల మిలమిల
నిజామాబాదు సిరులకు కళ కళ
గల గల గల గల పైరుల మిలమిల
నిజామాబాదు సిరులకు కళ కళ
పర్ణశాల... పర్ణశాల సీతమ్మ అడుగులు
భద్రాచలముల నిత్యవేడుకలు
కోనలెంట గోదావరి పరుగులు
జంటగ కిన్నెరసాని నడకలు
పగలే నీడలు పరచిన చందము
పచ్చని టేకు గోడుగులే అందము
బొగ్గు బావులు అగ్గినెలవులు
పాల్వంచ ఇలపంచె వెలుగులు
గిరజన జాతుల ఆయువుపట్టు
ఆశయాలు విరబూసిన చెట్టు
ఖనిజ రాశులకు తరగని గట్టు
ఉద్యమాల ఖిల ఖమ్మం మెట్టు
మంజీర కంజీరనాదం
సింగూరు జలపొంగుల హారము
సంగమతీర్థము సాదుల సత్రం
ఏడుపాయల శైవక్షేత్రము
మెతుకు దుర్గముల మేటి కొలుపులు
కోటను మించిన చర్చి తలుపులు
చెరివిరాల బాగయ్య దరువులు
యక్షగాన యల్లమ్మ అడుగులు
మల్లినాథుని లక్ష్యణ భాష్యం
మాటను పాటను పోటేత్తించిన
నేతల కవులను ఇచ్చిన జిల్లా ..తల్లి మెదకు జిల్లా
మలి ఉద్యమాల ఖిల్లా
మదిలో మెదిలే వదలని తావుల
మనసుల కదిపే పల్లె గురుతులా
బతుకున యాగం బరువుల రాగం
ఉరుకుల పరుగుల బరువుల తాళం
మరపించీ మురిపించే దామం
భాగ్యనగరమే ఇంద్రభవనము
ఆదరించమని చాపిన దోసిట
అక్షయపాత్ర హైదరబాదు
కుతుబుషాహీ అసఫ్ జాహీ
ఘజల్ ముషాహిర్ సునోరే భాయి
చార్మినారు మక్కామసీదు
పురానపూల్ దేఖోరే భాయి
కొబ్బరి తేటను మించిన ఊట
ఉస్మాన్ సాగరు గండిపేట
గోలుకొండన ఎగిరే జెండా
ఆశలు విరియును ప్రతి ఎదనిండా
గోలుకొండన ఎగిరే జెండా
ఆశలు విరియును ప్రతి ఎదనిండా
courtesy: V6
courtesy: V6
Thanks for the lyrics, first on internet
ReplyDeleteNot first on net.,
ReplyDeletehere is the actual link first on net
check it out
http://mycollegemyrules.blogspot.in/2015/06/telangana-bandhook-song-lyrics-first-on.html
This is fake
Deletethe song is superb and thanq for the lyrics
ReplyDeleteSuperb
ReplyDeleteSpr
ReplyDeleteSpr
ReplyDeleteFantastic song
ReplyDeleteAwesome,, telangana rastram samskruthi,sampradayalu,charitraka kattadalu..wow supervbb
ReplyDeleteThank very much...
ReplyDeleteSuperb song I like this
ReplyDeleteSuperb song I like this
ReplyDeleteIt's super song
ReplyDeleteGood
ReplyDelete